: మరో ఇద్దరు ఫిక్సర్లున్నారట!
స్పాట్ ఫిక్సింగ్ డొంక కదులుతోంది. ఇప్పటికే పోలీసులు తీగలాగి వదిలితే క్రికెట్ తో అవినాభావ సంబంధం వున్న ఫిక్సింగ్ భూతం ఐపీఎల్ ప్రతిష్టను మసకబారుస్తోంది. కాగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో 12 పరుగులిచ్చేందుకు డబ్బులు తీసుకున్నానంటూ అంకిత్ చండీలా అంగీకరించాడు. మరో ఆటగాడు చవాన్ కూడా తాను నేరం చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరిస్తూ ఫిక్సింగ్ తో సంబంధం ఉన్న మరి ఇద్దరి పేర్లు బయటపెట్టాడట.
తాజా సంఘటనలతో ఐపీఎల్ జట్లన్నింటికీ భయం పట్టుకుంది. ఎంత మందికి ఫిక్సింగ్ తో సంబంధం ఉంది, మరెంతమంది జైలుకి వెళ్ళనున్నారో అని గుండెలు చిక్కబట్టుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో కీలక దశలో ఉన్న ఐపీఎల్ నిరాటంకంగా ముగుస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. ఈ సీజన్ ముగిసినా రానున్న సీజన్ ఐపీఎల్ జరగడం అనుమానమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరో వైపు అవినీతికి పాల్పడ్డ క్రికెటర్లను నిషేధంతోనే వదిలేయకుండా తీవ్రంగా శిక్షించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
అంతగా పేరు ప్రతిష్టలు లేని క్రికెటర్లు పట్టుబడడంతో ఈ రకమైన వాదనలు వినిపిస్తున్నాయని, పేరున్న క్రికెటర్ పట్టుబడితే అప్పుడీ వాదనలు ఉండవని, నిషేధం సరిపోతుందని అంటారని మరికొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమయినా, మరెంత మంది ఆటగాళ్ళు పట్టుబడనున్నారో మరికొద్ది రోజులు గడిస్తే తేలిపోతుంది. ఆటగాళ్ళ కంటే బుకీలు పెద్ద ఎత్తున పట్టుబడుతుండడం విశేషం!