Maharashtra: టీచర్ ను కత్తితో కసితీరా పొడిచి చంపిన 13 ఏళ్ల విద్యార్థి!
- మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
- చిత్రవిచిత్రమైన కారణాలు చెబుతున్న బాలుడు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
విద్యార్థుల్లో హింసాత్మక స్వభావం పెరిగిపోతోందని చెప్పడానికి తాజా ఘటనే ఉదాహరణ. తన తల్లితో టీచర్ గొడవ పడటంతో ఓ 13 ఏళ్ల విద్యార్థి రెచ్చిపోయాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శివాజీనగర్ లో ఆయేషా అస్లమ్(30) అనే టీచర్ పిల్లలకు ట్యూషన్ చెబుతుంది. వీరి కుటుంబానికి ఓ పాఠశాల కూడా ఉంది. అయితే ఏమయిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 8.30 గంటలకు కత్తితో బాలుడు ఆయేషాపై దాడిచేశాడు. చివరకు అయేషా శరీరంలో కత్తి చిక్కుకుపోవడంతో శాంతించాడు. ఆయేషా అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘మా అమ్మ ఆయేషాను డబ్బులు అడిగింది. ఆమె ఇవ్వకపోవడంతోనే నేను హత్య చేశా’ అని స్థానికులకు తొలుత చెప్పిన బాలుడు, ‘ఆయేషా నాపై కర్రతో దాడిచేసింది. అందుకే నేను కత్తితో పొడిచా’ అని తన తండ్రికి చెప్పాడు.
ఆ తర్వాత ‘ఓ వ్యక్తి నాకు రూ.2,000 ఇచ్చి ఆయేషాను హత్య చేయమన్నాడు. లేదంటే నన్ను కాలువలోకి తోసి చంపేస్తామని బెదిరించాడు’ అని ఇంకో వాదన వినిపించాడు. దీంతో ఈ హత్య వెనుక అసలు కారణాన్ని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కుమారుడి నిర్వాకం తెలియగానే అతని తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.