Tollywood: తన వీధిలో రోడ్డు సరిగా లేదని టాలీవుడ్ నిర్మాత నిరసన... స్పందించిన అధికారులు
- దీక్ష చేపట్టిన టాలీవుడ్ నిర్మాత పి.శివరామప్రసాద్
- సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు దీక్ష
- వెంటనే పనులు మొదలుపెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
టాలీవుడ్ సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్ జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దీక్షకు దిగారు. షేక్ పేట ఓయూ కాలనీలో తాను నివసిస్తున్న వీధి అస్తవ్యస్తంగా ఉందని, వర్షం కురిస్తే నీళ్లు నిలిచిపోతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. నాలుగు వారాల క్రితం అధికారులు రోడ్డు వేసే నిమిత్తం కంకర కుప్పలు పోయగా, వాటిలో ఓ కుప్ప కారణంగా శివరామప్రసాద్ కిందపడిపోయారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయన అక్కడే వుండి నిరసన తెలుపగా, అధికారులు స్పందించారు. వెంటనే పనులకు శ్రీకారం చుట్టడంతో నిర్మాత దీక్ష విరమించారు.