Chandrababu: కోడెల తప్పుచేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారు: చంద్రబాబు ఆవేదన
- కోడెలను పల్నాటిపులిగా అభివర్ణించిన టీడీపీ చీఫ్
- రాష్ట్రంలో ఉన్మాద పాలన నడుస్తోందంటూ మండిపాటు
- కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సహచరుడు కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తన ఆవేదనను మరోసారి ట్విట్టర్ లో వెలిబుచ్చారు. పల్నాటిపులిగా పేరుమోసిన ఓ సీనియర్ నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇతరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్మాద పాలన నడుస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
కోడెల తప్పు చేసి చనిపోలేదని, వేధింపులకు గురై చనిపోయారని, ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారని నిలదీశారు. ఇది ప్రభుత్వ హత్య అని పేర్కొన్న చంద్రబాబు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కేవలం లక్ష రూపాయల పాత ఫర్నిచర్ విషయంలో ఆయనను జీవితఖైదు చేయాలని చూశారని, అది కూడా రూ.43 వేల కోట్లు దోచుకున్నట్టు సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటూ, 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి కోడెల శివప్రసాదరావుపై అవినీతి ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం దారుణమని చంద్రబాబు ట్వీట్ చేశారు.