: ఫిక్సింగ్ బకరాలను పట్టడంలో 'అమిత' నేర్పరి
నిరుటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ క్రికెటర్ అమిత్ సింగ్ నేడు వార్తల్లో వ్యక్తయ్యాడు. ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్టు చేసిన బుకీల్లో అమిత్ సింగ్ కూడా ఉన్నాడు. ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉందని నిర్ధారణ కావడంతో, బీసీసీఐ, దేశవాళీ టోర్నీల్లో ఆడకుండా ఈ పేస్ బౌలర్ పై సస్పెన్షన్ వేటేసింది. కాగా, కొత్తబంతితో నిప్పులు చెరిగే అమిత్ సింగ్ టెయిలెండర్ గానూ ఉపయుక్తమైన ఆటగాడు. అయితే, ఇంతటి ప్రతిభావంతుడూ దారి తప్పాడు. బుకీలకు ఆటగాళ్ళకు మధ్య వారధిలా వ్యవహరించాడు.
నిన్న పోలీసులు అరెస్టు చేసిన బుకీ చంద్రేష్ తో అమిత్ కు ఎప్పటినుంచో లింకులున్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. చంద్రేష్ తరుపున ఈ గుజరాతీ క్రికెటర్.. ఫిక్సింగ్ కు అనుకూలురైన ఆటగాళ్ళను అన్వేషించేవాడు. వారిని తరచూ ఫోన్లలో సంప్రదించి, ఫిక్సింగ్ కు ఓకే చెప్పేలా ఒప్పించడంలో ఇతగాడు నేర్పరని పోలీసులు అంటున్నారు.