Chandrababu: దాదాపు 9 నెలల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టిన చంద్రబాబు
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం
- పూలవర్షం కురిపించిన కార్యకర్తలు
- తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తానంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఇవాళ ఘనస్వాగతం లభించింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, జై చంద్రబాబు నినాదాలతో ట్రస్ట్ భవన్ పరిసరాలను హోరెత్తించారు. దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం అనంతరం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టడమే వారి సంతోషానికి కారణం. కాగా, చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడమే కాదు, తెలంగాణ టీడీపీ నేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో కీలక సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో టీడీపీకి కొత్త నాయకత్వం అవసరమని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయాల్సివుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ జన్మస్థానం హైదరాబాదేనని, టీడీపీకి పునర్ వైభవం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నానని ఈ సందర్భంగా నేతలతో అన్నారు.