bengaluru: వైవాహిక జీవితాన్ని బాగు చేస్తానని.. అత్యాచారానికి పాల్పడిన జ్యోతిష్యుడు

  • భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ
  • జీవితాన్ని చక్కదిద్దుతానంటూ నమ్మబలికిన జ్యోతిష్యుడు
  • స్నేహితుడితో కలిసి అత్యాచారం

వైవాహిక జీవితాన్ని బాగుచేస్తానంటూ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నకిలీ జ్యోతిష్యుడిని బెంగళూరు పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. బాణసవాడికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. జ్యోతిష్యుడిగా చెప్పుకుంటున్న మణికంఠ వద్ద ఇటీవల ఆమె తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె చెప్పింది విన్న మణికంఠ.. ఆమెకు సర్పదోషం ఉందని, అది పోవాలంటే  కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేయాల్సి ఉంటుందని నమ్మబలికాడు. అందుకు రూ.40 వేలు ఖర్చు అవుతాయని నమ్మబలికాడు.

మణికంఠ చెప్పిన దానికి బాధిత మహిళ సరేననడంతో తన స్నేహితుడు గణేశాచారితో కలిసి ఆమెను ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉపదేశం పేరుతో గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపించి బెదిరించి విషయం బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాణసవాడి పోలీసులు నిన్న మణికంఠను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు గణేశాచారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News