Chandrababu: కొన్ని చానెళ్ల ప్రసారాలు నిలిపివేయాలని మంత్రులే బెదిరించడం ఏంటి?: ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
- టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం
- చానళ్ల నిలిపివేత అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లిన నేతలు
- విస్మయం వ్యక్తం చేసిన చంద్రబాబు
పల్నాడు ప్రాంతంలో తమ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ తీవ్రస్థాయిలో పోరాడుతోంది. ఇదే అంశంపై సీనియర్ నేతలతో సమావేశమైన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్న పలు చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నారంటూ ఆయన దృష్టికి రావడంతో మండిపడ్టారు. అది కూడా కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలంటూ మంత్రులే బెదిరిస్తున్నట్టు తెలియడంతో తీవ్రంగా స్పందించారు.
"తాము ఏ చానళ్లు చూడాలన్నది వినియోగదారుల ఇష్టం. ఫలానా చానల్ ను ఎంచుకునే స్వేచ్ఛను ట్రాయ్ కల్పించింది. అందుకు ఓ విధానం కూడా ఉంది. అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు వార్తా చానళ్ల గొంతు నొక్కేయాలని చూస్తున్నారా? టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని మంత్రులే బెదిరించడం దారుణం. బాధితుల వార్తలను ప్రసారం చేయడం పట్ల మీకు అభ్యంతరం ఏంటి?" అని నిలదీశారు.