Chandrababu: జగన్ తన మూర్ఖత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు బయటపెట్టుకున్నారు: చంద్రబాబు విమర్శలు
- జగన్ పై చంద్రబాబు అసంతృప్తి
- నిరసనల పట్ల సీఎం స్పందించకపోవడం దారుణమంటూ వ్యాఖ్యలు
- రైతుల్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం అన్న చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేర చరిత్ర ఉన్న జగన్ నేరాలే లేకుండా చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలున్న వ్యక్తి నోట అలాంటి మాటలు రావడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు.
వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించామని, నిరసనలపై ఏ సీఎం అయినా స్పందించకుండా ఉండరని, కానీ జగన్ మాత్రం సీఎంగా ఉండి కూడా స్పందించకపోవడం దారుణం అని అభిప్రాయపడ్డారు. తద్వారా జగన్ తన మూర్ఖత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రజలకు వెల్లడించారని చంద్రబాబు విమర్శించారు. రైతులే లక్ష్యంగా వైసీపీ దాడులు చేయడం బాధాకరమైన విషయం అన్నారు. వైసీపీ బాధితులకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.