Chandrababu: వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: చంద్రబాబు
- ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని శాంతియుతంగా తలపెట్టాం
- గృహనిర్బంధాలతో తమను అడ్డుకోవడం పిరికి చర్య
- పునరావాస బాధితులకు ఆహారం కూడా అందకుండా చేస్తున్నారు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తాము శాంతియుతంగా తలపెట్టామని... అయితే, గృహనిర్బంధాలతో తనను, టీడీపీ నేతలను అడ్డుకోవడం పిరికి చర్య అని అన్నారు. పునరావాస బాధితులకు ఆహారం కూడా అందకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నిర్దయకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఫాసిస్ట్ పాలనను తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్ఠం అయిందని విమర్శించారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని... టీడీపీ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. పునరావాస శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అంతకు ముందు తన నివాస ప్రాంగణంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని, పౌర హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. పోలీసులు అనుమతిచ్చినప్పుడు ఆత్మకూరుకు వెళ్తానని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో అనేక దారుణ ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.