Andhra Pradesh: ఇది రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
- సమాధానం చెప్పమంటే కౌంటర్ ప్రోగ్రామ్ ఇస్తారా?
- వైసీపీ నేతలు ‘ఛలో ఆత్మకూరు’ అనడం హాస్యాస్పదం
- దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ‘ఛలో ఆత్మకూరు’ తలపెట్టిన నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ బాధితులు వారి స్వగ్రామంలో నివసించే హక్కు కోసమే ‘ఛలో ఆత్మకూరు’ చేపట్టామని అన్నారు. వైసీపీ బాధితుల శిబిరం పెట్టి ఎనిమిది రోజులు అయినా మీకు కనిపించలేదా? ఇప్పుడు వచ్చి బాధితులను తీసుకెళ్తామంటారా? వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారో చెప్పాలి అని ప్రశ్నించిన బాబు, ‘ఇది రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పమని వైసీపీ నేతలను కోరితే కౌంటర్ ప్రోగ్రామ్ ఇస్తారా? అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు ‘ఛలో ఆత్మకూరు’ అనడం హాస్యాస్పదంగా ఉందని, ఇది పైశాచిక, రాక్షస ఆనందం తప్ప మరోటి కాదని విమర్శించారు. తాము తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని ఘంటాపథంగా చెప్పారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టమని తాను అడగడం లేదని, తమ వాళ్లను హింసించొద్దని మాత్రమే కోరుతున్నానని అన్నారు.