YSRCP: వైసీపీ దాడుల్లో గాయపడ్డ మా వాళ్లను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా?: చంద్రబాబునాయుడు ఫైర్
- సీఎం, హోం మంత్రి సమాధానం చెప్పాలి
- ఇలాంటి అరాచకపాలన ఎన్నడూ చూడలేదు!
- మా వాళ్లపై అక్రమ కేసులు పెడతారా?
మీ దాడుల్లో గాయపడ్డ మా వాళ్లను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని ఎగతాళి చేస్తారా? అంటూ వైసీపీ నేతలపై చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ దాడులను నిరసిస్తూ రేపు ‘ఛలో ఆత్మకూరు’ తలపెట్టిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్, హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తన రాజకీయ జీవితంలో ఇంత అరాచకపాలన ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ వారు దాడులు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 565 సంఘటనలు జరిగాయని చెప్పారు. దాడులకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలపై బెయిలబుల్ కేసులు పెడుతున్నారని, తమ కార్యకర్తలపై మాత్రం నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి హింసిస్తున్నారని ధ్వజమెత్తారు.
తమ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని, టీడీపీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేశారని, దాడులకు తెగబడ్డారని, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాలు చెప్పిన అమ్మాయిలపై కూడా నీచమైన పోస్ట్ లు పెడుతున్నారని, వారి క్యారెక్టర్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా, వైసీపీ నేతల అరాచకాలపై ఓ పుస్తకం, ‘పులివెందుల ఫ్యాక్షనిజం గుప్పిట్లో రాష్ట్రం’ పేరిట మరో పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ‘ఛలో ఆత్మకూరు’ పుస్తకాన్ని రేపు విడుదల చేయనున్నారు.