Telugudesam: నాపై అవినీతి ఆధారాలు ఇంకా దొరకలేదని అధికారులు, మంత్రులను దూషిస్తున్నారు: జగన్ పై చంద్రబాబు సెటైర్లు
- ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తా
- ఏ సీఎం హయాంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు
- ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
తనపై ఎటువంటి అవినీతి ఆధారాలు దొరకలేదని అధికారులు, మంత్రులను దూషిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తానని చెప్పారు.
ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంతటి అనాగరిక పరిస్థితులు లేవని విమర్శించారు. గతంలోనూ తనపై 26 కేసులు వేసి ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారిపై 565 కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రజల ముందు ఈ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా నిలబెట్టే వరకూ వదిలే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. తాను చేసే ధర్మపోరాటానికి న్యాయవాదుల అండ కోరుతున్నానని అన్నారు.