Chandrababu: ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోంది: చంద్రబాబు ఆగ్రహం
- వివాదంగా మారిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉదంతం
- తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
- కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి జన్మతః వచ్చిన సిద్ధాంతం అంటూ ట్వీట్
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తాను క్రైస్తవురాలినని, తన భర్త కాపు కులానికి చెందిన వ్యక్తి అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబితే, ఇప్పుడు వైసీపీ వాళ్లు ఆమెను దళిత మహిళ అంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి విషయంలో వైసీపీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోందని మండిపడ్డారు. మత ఘర్షణలు రేకెత్తించడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వైసీపీకి జన్మతః వచ్చిన సిద్ధాంతం అని చంద్రబాబు విమర్శించారు. కానీ, టీడీపీ బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ అని ఉద్ఘాటించారు. వైసీపీ తరహాలో కుల రాజకీయాలు చేయడం టీడీపీ సంస్కృతి కాదన్నారు.