Chandrababu: దమ్ముంటే నాపై దాడి చేయండి.... టీడీపీ హయాంలో ఇలా చేసుంటే మీరు ఉండేవాళ్లేనా?: వైసీపీపై చంద్రబాబు ఫైర్
- కార్యకర్తలను హద్దుల్లో పెట్టుకోవాలన్న చంద్రబాబు
- వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలేనంటూ వ్యాఖ్యలు
- సీఎం జగన్ తన తండ్రి వైఎస్ కంటే దారుణంగా ఉన్నారన్న చంద్రబాబు
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలేనని, పోలీసుల సాయంతో వైసీపీ సర్కారు దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు అరండల్ పేటలో పల్నాడు వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీకి ఓటేసినంత మాత్రాన గ్రామాల నుంచి వెళ్లిపొమ్మంటారా? అని నిలదీసిన చంద్రబాబు, ఇప్పటివరకు ఏడుగురిని చంపేశారని, మరో 22 మందిపై దాడికి దిగారని ఆరోపించారు.
కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకత్వంపైనే ఉందని, టీడీపీ హయాంలో ఇలా చేసుంటే మీరు ఉండేవాళ్లేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనపై దాడి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. జగన్ తన తండ్రి వైఎస్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.