Andhra Pradesh: ముంపు ప్రాంతాల్లో ఏ కంట చూసినా కన్నీరే!: చంద్రబాబునాయుడు
- కృష్ణా జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాబు
- బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
- నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కృష్ణా జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. విజయవాడ, కృష్ణా కరకట్ట వెంబడి ప్రాంతాల్లో వరద బాధితుల సమస్యలు వింటుంటే ప్రభుత్వం వారి పట్ల ఎంత నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలిసిందని విమర్శించారు. పంటలు బాగా దెబ్బతిన్నాయని, పరిసరాలు ఇంకా బురదమయంగానే ఉన్నాయని, బాధితులకు తాగునీరు దొరకడం లేదని అన్నారు. వ్యాధులు వచ్చే అవకాశం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోట్లేదని అన్నారు.
అదేవిధంగా, తోట్లవల్లూరులో కరకట్ట వెంబడి వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించానని, ‘ఏ కంట చూసినా కన్నీరే. కంద, పసుపు, చెరకు మొదలైన వాణిజ్య పంటలు బాగా దెబ్బతిన్నాయి’ అని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.