Chandrababu: మంత్రులందరూ నా ఇంటిచుట్టూ తిరుగుతున్నారు... వరద బాధితులను పరామర్శించేందుకు ఎలా వస్తారు?: చంద్రబాబు
- కృష్ణా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
- తమ గోడు చంద్రబాబుతో మొరపెట్టుకున్న బాధితులు
- సాయం చేసేందుకు మంత్రులు, అధికారులు ఎవరూ రాలేదని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇళ్లు మునిగిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నా మంత్రులు కానీ, అధికారులు కానీ సాయం చేసేందుకు రాలేదని బాధితులు చెప్పడంతో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎలా వస్తారు? మంత్రులంతా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
వరదను నియంత్రించే అవకాశం ఉన్నా, తన నివాసాన్ని ముంచేందుకు నీళ్లు నిలబెట్టారని ఆరోపించారు. ఇది అన్యాయం అని, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వరద ప్రభావం తగ్గేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని, స్థానికులందరికీ పట్టాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడంలేదని ఎద్దేవా చేశారు. కనీసం అన్న క్యాంటీన్లు ఉన్నా వరద బాధితుల ఆకలి తీర్చేవని ఆవేదన వ్యక్తం చేశారు.