Andhra Pradesh: కొత్త ఇసుక విధానం రాకముందే వైసీపీ నేతలను కుబేరులను చేయాలని చూస్తోంది: టీడీపీ నేతల విమర్శలు

  • ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు!
  • సిమెంట్ కంపెనీలతో లాలూచీ కుదరదంటూనే ఇసుక అందకుండా చేస్తున్నారు
  • ఈ ప్రభుత్వం త్వరలో మీ సేవా కేంద్రాలకూ మంగళం పాడాలనుకుంటోంది

ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిమెంట్ కంపెనీలతో లాలూచీ కుదరదంటూనే ఇసుక అందకుండా చేస్తున్నారని విమర్శించారు. కొత్త ఇసుక విధానం రాకముందే వైసీపీ నేతలను కుబేరులను చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని, సిమెంట్ కంపెనీలు బస్తాకు రూ.5 చొప్పున ఇవ్వాలని వైసీపీ చతుష్టయం సజ్జల, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

ఈ రద్దుల ప్రభుత్వం త్వరలో మీ సేవా కేంద్రాలకు కూడా మంగళం పాడాలనుకుంటోందని, ఇప్పటికే వేలాది ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా సహకార సంఘాల ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, గ్రామీణ స్థాయిలో సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో వైసీపీ కార్యకర్తలకు సహకార సంఘాల బాధ్యతలు అప్పగింత తగదని అన్నారు.

విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఆవులు ఆనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు. గోశాలలో పెద్ద సంఖ్యలో మూగజీవాల మరణం బాధాకరమని, ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని, గోవుల పోస్టుమార్టం నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News