Andhra Pradesh: జగన్ పాలనను మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు.. అనవసరంగా బురదచల్లొద్దు: చంద్రబాబుకు అంబటి హితవు
- ఆశా వర్కర్లకు సంబంధించి బాబు ట్వీట్ పై ఫైర్
- 2017లో తెలంగాణలో ఆశా వర్కర్ల ఆందోళన ఫొటో అది
- చంద్రబాబు అబద్ధాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరు
ఏపీ సీఎం జగన్ పాలనను మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు గానీ, ప్రభుత్వంపై అనవసరంగా బురదచల్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ట్వీట్ ను తప్పుబడుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. 2017లో తెలంగాణలో జరిగిన ఆందోళనకు సంబంధించిన ఆశా వర్కర్ల ఫొటోను చంద్రబాబు పోస్ట్ చేశారని విమర్శించారు.
చంద్రబాబు అబద్ధాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకూ చేసిన అబద్ధపు ప్రచారాల వల్లే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైందని ఎద్దేవా చేశారు. బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అంటూ చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు, రక్తాన్ని పీల్చే జలగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.