Chandrababu: చంద్రబాబు ‘తన్నే దున్నపోతు’ అని తెలియడంతో ప్రజలు ఓడించారు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య కౌంటర్
- ‘పాలిచ్చే ఆవు’ అని భావించి 2014లో బాబుకు పట్టం కట్టారు
- ఎన్ని విన్యాసాలు చేసినా టీడీపీ ఇక కోలుకోలేదు
- చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజా తీర్పును కించపరిచేలా ఉన్నాయి
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడం, టీడీపీ ఓటమిపాలు కావడాన్ని చంద్రబాబునాయుడు నిన్న ప్రస్తావించిన విషయం తెలిసిందే. ‘పాలిచ్చే ఆవును వదిలిపెట్టుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజలనే బాధ్యులను చేసిన ఏకైక నేత చంద్రబాబే అని విమర్శించారు. ఏపీకి ఎన్నో చేస్తే టీడీపీకి 23 సీట్లే ఇచ్చారంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజా తీర్పును కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు.
‘పాలిచ్చే ఆవు’ అని భావించి 2014లో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని, అయితే, బాబు ‘తన్నే దున్నపోతు’ అని తెలియడంతో మొన్నటి ఎన్నికల్లో ఓడించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన ప్రజలకు ఎన్నో అనుభవాలు నేర్పిందని, ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళితే, తనపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అసలు, చంద్రబాబునాయుడు దేనికి భయపడుతున్నారు? ఆయన మానసిక స్థితి సరిగా ఉందా? లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా వెళ్లిన చంద్రబాబు, తన మానసిక స్థితిని వైద్యులతో పరీక్ష చేయించుకోవడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు.