Telugudesam: ప్రజల కోసం అవమానాలు భరిస్తున్నా.. రుణమాఫీ డబ్బులివ్వకుంటే కోర్టుకే: చంద్రబాబు
- కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది
- రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు
- రుణమాఫీ ఎందుకు చేయడం లేదో నిలదీయండి
వైసీపీ ప్రభుత్వం తనను ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసమే వాటిని భరిస్తున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయ దాడులు, బెదిరింపు ధోరణి చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదన్నారు. కార్యకర్తలు అధైర్య పడవద్దని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారని, వారికి రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకెళ్లేందుకు కూడా వెనుకాడబోమని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. తమ హయాంలో రైతులకు ప్రామిసరీ నోటు ఇచ్చామని, అది ప్రభుత్వం తరపున ఇచ్చినదని, అధికారంలో ఎవరున్నా దానిని అమలు చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.