YSRCP: పోలవరంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు: పార్థసారథి
- ప్రజలు బుద్ధి చెప్పినా దేవినేని ఉమలో మార్పు రాలేదన్న వైసీపీ నేత
- చంద్రబాబు అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారంటూ విమర్శలు
- దోపిడీలు అరికట్టేందుకే సీఎం జగన్ నిర్ణయాలంటూ సమర్థన
వైసీపీ నేత పార్థసారథి టీడీపీ నాయకులపై ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి నవయుగ కంపెనీకి పనులు అప్పగించారని ఆరోపించారు. ప్రజలు బుద్ధి చెప్పినా దేవినేని ఉమలో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. 60సి అడ్డంపెట్టుకుని వేల కోట్ల దోపిడీకీ పాల్పడ్డారని, ఇలాంటి అడ్డగోలు దోపిడీలు అరికట్టేందుకు సీఎం జగన్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్థసారథి స్పష్టం చేశారు.
చంద్రబాబు అన్ని రంగాల్లోనూ దోపిడీకి పాల్పడ్డారని, చంద్రబాబు వైఖరి వల్లే విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని విమర్శించారు. లంచాల కోసం అత్యధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేశారని, చివరికి అన్న క్యాంటీన్లలో కూడా కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరులో మార్పులేదని, చినబాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
బందరు పోర్టును తెలంగాణ సర్కారు పరం చేస్తున్నామని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ పార్థసారథి మండిపడ్డారు. దొంగ జీవోలు ఇవ్వడం చంద్రబాబుకే అలవాటని, బందరు పోర్టు నిర్మాణానికి తమ సర్కారు చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అంటూ పార్థసారథి నిలదీశారు.