Cafe Coffee Day: నేత్రావతి నదిలో దొరికిన మృతదేహం సిద్ధార్థదేనని ఎలా తేల్చారంటే..!

  • ఈ ఉదయం లభ్యమైన మృతదేహం
  • చానాళ్ల నుంచి పాత నోకియా ఫోన్ వాడుతున్న సిద్ధార్థ
  • దాన్ని చూసి గుర్తుపట్టిన కుటుంబీకులు

రెండు రోజుల క్రితం మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వద్ద అదృశ్యమైన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ ఈ ఉదయం విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. గడచిన రెండు రోజులుగా సిద్ధార్థ ఆచూకీ కోసం నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు, మరపడవలు, హెలికాప్టర్లతో గాలించగా, ఆయన నదిలోకి దూకారని చెప్పిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ములిహిత్లు ఐలాండ్ దగ్గరలో మృతదేహాన్ని గుర్తించారు.

తమకు లభించిన మృతదేహం సిద్ధార్థదేనని నిర్ధారించేందుకు పోలీసులు ఆయన వద్ద లభించిన వస్తువులను కుటుంబ సభ్యులకు చూపించారు. అందులో భాగంగా సిద్ధార్థ్ జేబులో ఉన్న పాత ఫోన్ ను చూపారు. చాలా కాలంగా సిద్ధార్థ్, పాత నోకియా మొబైల్ ఫోన్ నే వాడుతున్నారని కుటుంబీకులు చెప్పారు. అదృశ్యమైన రోజున ఆయన వేసుకున్న ప్యాంట్ ను గుర్తించారు. కాగా, ప్రస్తుతం సిద్ధార్థ్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. ఆపై ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని చిక్ మగళూరుకు తరలిస్తామని కుటుంబీకులు వెల్లడించారు. ఆయన మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డే ఔట్ లెట్లను ఒకరోజు పాటు మూసివేసి, నివాళులు అర్పించాలని సంస్థ నిర్ణయించింది.

More Telugu News