Chandrababu: ఇది సీఎం ఇల్లా? లేక లోటస్ పాండ్ లాంటి ప్రయివేటు రాజభవనమా?: జగన్ పై చంద్రబాబు విమర్శలు
- కష్టాలు చెప్పుకుందామని ప్రజలు వస్తే 144 సెక్షన్ పెట్టుకుంటారా?
- ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా హామీలు నెరవేర్చాలి
- వరుస ట్వీట్లు చేసిన టీడీపీ అధినేత
ఏపీ ప్రభుత్వ విధానాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లను తొలగించి, వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకొస్తూ ఇదే ఉద్యోగాల కల్పన అంటూ ప్రచారం చేసుకోవడం ఏం పిచ్చిపనో తనకు అర్థంకావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.
"మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాళ్లే లేరని భావిస్తున్నారా? ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా, తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది సీఎం ఇల్లా? లేక లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?" అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.