: మనుషుల వాసన ఈ దోమకు మహా మోజు!
మన వాసనంటే మలేరియా దోమకు ఇష్టమట... అందుకే మనల్ని వెంటనే కుట్టేసి మనకు మలేరియా అంటించేస్తుందట...! ఏంటీ నమ్మలేకపోతున్నారా... కానీ ఇది నిజం. దోమల్లో మలేరియా పరాన్నజీవి బారిన పడిన దోమలకు మనుషుల వాసనలంటే ఇష్టమట, దీంతో అవి వెంటనే మనుషుల వేపు అకర్షించబడి వారిని కుట్టేందుకు ప్రయత్నాలు చేస్తాయట. ఈ విషయాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
వీరు మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిఫారం పరాన్నజీవితో ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఆడ అనాఫిలీ గ్యాంబియే సెన్సు స్ట్రిక్టో దోమలు మనుషుల వాసనలకు ఆకర్షించబడటాన్ని ప్రయోగశాలలో గమనించారు. ఇన్‌ఫెక్షన్‌కు గురికాని దోమలు పెద్దగా మనుషుల శరీర వాసనలపట్ల ఆకర్షణకు గురికాలేదట. సాధారణ దోమతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్‌కు గురైన దోమలు మూడు రెట్లు అధికంగా మనల్ని కుట్టే ప్రయత్నాలు చేస్తాయట. దీంతో మనుషుల శరీరంలోని వాసనల్లోగల కీలక రసాయనాలను గుర్తించడం ద్వారా మలేరియా పరాన్నజీవిని నిరోధించే పద్ధతులను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.