Andhra Pradesh: ఏపీలో సిమెంట్ బస్తా కంటే ఇసుక బస్తా ధర అధికంగా ఉంది: చంద్రబాబు విమర్శలు
- ఇసుక కొరత కారణంగా అధిక ధరలకు విక్రయం
- వైసీపీ రౌడీ యిజాన్ని పులివెందులలో చూపించుకోవాలి
- మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకోం
ఏపీలో సిమెంట్ బస్తా ధర కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక కొరత కారణంగా, ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఇసుక పాలసీని ఇంకా అమలు చేయకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా తమ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించారు. వైసీపీ తమ రౌడీయిజాన్ని పులివెందులలో చూపించుకోవాలని, తమను భయపెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.
వైసీపీ నేతల తీరు ఇలానే ఉంటే భవిష్యత్ లో రాష్ట్రం అనాథగా మారిపోతుందని అన్నారు. ప్రజలు తిరగబడితే వైసీపీ నేతలు పారిపోక తప్పదని, నిత్యం అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకుండా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తున్నారని విమర్శించారు.