Andhra Pradesh: ముఖ్యమంత్రి గారు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: జగన్ పై చంద్రబాబు ఫైర్
- అసెంబ్లీలో వైసీపీ సభ్యుల భాషపై బాబు ఆగ్రహం
- భాషను కంట్రోల్ చేసుకోవాలి
- అప్పుడే హుందాతనం ఉంటుంది
ఏపీ శాసనసభలో వైసీపీ సభ్యుల ప్రవర్తన, వారు మాట్లాడే భాషపై టీడీపీ పక్ష నేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి గారు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి, భాషను కంట్రోల్ చేసుకోవాలి. నోరుందని విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే.. హుందాతనం కాదు. హుందాతనం కోల్పోయి చిల్లరతనంతో చాలా చీప్ గా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రినీ చూడలేదు. నీకు హుందాతనం లేకపోవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాకు హుందాతనం అవసరం. ఆ చైర్ కు నువ్వు (జగన్) రెస్పెక్టు ఇవ్వాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అని హితవు పలికారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడెవరూ భయపడేవాళ్లు లేరని, జగన్ నోరు పారేసుకుంటున్నాడని ఆయనకు సరెండర్ అయ్యే వాళ్లు అంతకన్నా ఉండరని గట్టిగా హెచ్చరించారు.