: ఒక్క కాఫీకోసం కోట్లు ఖర్చు...!
కాఫీ తాగేందుకు ఏ వందో... రెండొందలో ఖర్చుపెట్టడం వేరు... కానీ ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టారంటే... సదరు వ్యక్తి ఎలాంటి వాడో ఇట్టే అంచనా వేయొచ్చు. అయితే, కాఫీ నేనొక్కడినే తాగేది కాదు... ప్రఖ్యాత 'యాపిల్' సంస్థ అధినేతతో కాబట్టి, కోట్లయినా ఫరవాలేదంటున్నాడు ఆ వ్యక్తి! 'యాపిల్ సంస్థ అధినేత టిమ్‌కుక్‌తో కలిపి కాఫీ తాగే అద్భుత అవకాశం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?' అంటూ ఒక సంస్థ ప్రకటన ఇచ్చింది. దీనికి అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఆ సంస్థ వేలం పాట నిర్వహించింది.
ఈ వేలం పాటలో ఒక అజ్ఞాత వ్యక్తి అక్షరాలా మూడుకోట్లా ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ వేలం పాటను గెలుచుకున్నారు. టిమ్‌కుక్‌తో కాఫీ తాగే అవకాశం సొంతం చేసుకున్నారు. వివిధ సేవా కార్యక్రమాలకు నిధుల సమీకరణలో భాగంగా టిమ్‌కుక్ తన విలువైన సమయాన్ని ఈ విధంగా గడిపేందుకు అంగీకరించాడు. దీంతో సదరు అజ్ఞాత వ్యక్తి కాఫీ తాగి కొద్దిసేపు కబుర్లు చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎంత టిమ్‌కుక్ అయినా... అంత డబ్బు వెచ్చించాలా...?!