Chandrababu: మేమేమీ ప్రభుత్వంపై యుద్ధానికి కత్తులు, కటార్లు తీసుకెళ్లట్లేదు: చంద్రబాబు
- ఇచ్చిన హామీలు గుర్తుచేయడం తప్పా? అంటూ నిలదీసిన చంద్రబాబు
- వ్యూహంలో భాగంగానే సభ్యుల సస్పెన్షన్ అంటూ ఆగ్రహం
- ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. తామేమీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సభకు కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని, వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారపక్షంపై విమర్శలు చేశారు. బీసీ నాయకుడ్ని సభ నుంచి సస్పెండ్ చేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూడాలని చంద్రబాబు ప్రశ్నించారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే సస్పెండ్ చేసినట్టు అర్థమవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా, డిప్యూటీ లీడర్ ను అకారణంగా సస్పెండ్ చేస్తే తామెలా ఖాళీగా కూర్చుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అభద్రతా భావం నెలకొంటోందని, ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోతోందని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై టీడీఎల్పీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.