Andhra Pradesh: ఇది మీ ప్రైవేట్ జాగీరు కాదు, ఇదొక రాష్ట్రం: వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఆగ్రహం
- మందబలం ఉందని ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు
- పీపీఏలపై తప్పుడు సమాచారం ఇస్తారా?
- ప్రాజెక్టులను భ్రష్టు పట్టించే పరిస్థితి తెచ్చారు!
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఇది మీ ప్రైవేట్ జాగీరు కాదు, ఇదొక రాష్ట్రం. మాకు మందబలం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చేస్తాం’ అనే పరిస్థితి మంచిది కాదని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.
తమ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలపై ప్రస్తుత ప్రభుత్వ అధికారులు ఎంత దారుణంగా స్టేట్ మెంట్లు ఇచ్చారు? తప్పుడు సమాచారం ఇస్తారా? అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలు రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివని, వీటిని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. అలాంటి ప్రాజెక్టులను భ్రష్టు పట్టించి, సర్వనాశనం చేసే పరిస్థితిని తీసుకొచ్చేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు.