Andhra Pradesh: టీడీపీ నేతలతో పాటు యెల్లో మీడియా మా మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది!: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  • నందిగం సురేష్-శ్రీదేవి మధ్య ఆధిపత్య పోరు
  • మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలు
  • ఖండించిన ఇరువురు నేతలు

బాపట్ల లోక్ సభ సభ్యుడు, వైసీపీ నేత నందిగం సురేష్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. వివాదాల పేరుతో తమ మధ్య టీడీపీ నేతలు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తమపై కావాలనే టీడీపీ నేతలు బురద చల్లుతున్నారని మండిపడ్డారు.  అమరావతిలో ఈరోజు ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు.

‘టీడీపీ నేతలు, యెల్లో మీడియా గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు బురద చల్లుదామా? అని ఎదురుచూస్తున్నారు. మీడియాలో వస్తున్న ఫ్లెక్సీ గొడవ, ఇసుక గొడవల గురించి నాకు అస్సలు తెలియదు. టీడీపీ హయాంలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఏపీకి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ ఏడాది మార్చి నుంచి అక్రమ తవ్వకాలు ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకోవాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు.

ఇసుక రీచుల దగ్గర పోలీసులు ఉన్నారు. విజిలెన్స్ అధికారులు ఉన్నారు. కానీ టీవీలో, పేపర్లలో మాత్రం ఈ ట్రాక్టర్లు నందిగం సురేష్ గ్రూపువనీ, ఎమ్మెల్యే శ్రీదేవి అరెస్ట్ చేయించారని వార్తలు వచ్చాయి. మేమంతా జగనన్న కుటుంబ సభ్యులం. జగనన్న సైనికులం. మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఏపీలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తాం. నందిగం సురేష్ తో కలిసి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తా. టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి కొందరు చేస్తున్న పనులే ఇవి. దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని శ్రీదేవి స్పష్టం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన నందిగం సురేష్ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

More Telugu News