Andhra Pradesh: వైసీపీకి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: టీడీపీ అధినేత చంద్రబాబు
- టీడీపీ నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే వైసీపీ వైఖరి
- నిర్మాణాల్లో ప్రతిష్టంభనే లక్ష్యంగా వైసీపీ చర్యలు
- ఏపీ అభివృద్ధికి గండి కొట్టేలా వైసీపీ పనిచేస్తోంది
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భేటీ ముగిసింది. వైసీపీకి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, వారి చేతకానితనం బయటపడకుండా ఇదంతా చేస్తున్నారని ఈ భేటీలో చంద్రబాబు అన్నట్టు సమాచారం. వైసీపీ నేతల వ్యవహార శైలి విధ్వంసక ధోరణితో ఉందని విమర్శించారట. టీడీపీ నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే లక్ష్యంగా వైసీపీ వైఖరి ఉందని, ఆ పార్టీ నేతలకు నిర్మాణాలపై దృష్టి లేదని బాబు మండిపడ్డారని సంబంధిత వర్గాల సమాచారం. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిష్టంభనే లక్ష్యంగా వైసీపీ చర్యలు ఉంటున్నాయని అన్నారట. పీపీఏలపై కేంద్రం చెప్పిన దానికి విరుద్ధంగా వైసీపీ నేతల ప్రవర్తన ఉందని, టీడీపీపై బురదచల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి గండి కొట్టేలా వారు పనిచేస్తున్నారని వైసీపీ నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టీడీపీ వర్గాల సమాచారం.