Andhra Pradesh: ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేశ్ లు సమాధానం చెప్పాలి: మంత్రి కన్నబాబు

- జనవరి నుంచి విత్తనాల సేకరణకు నిధులు అడిగినా ఇవ్వలేదు
- చంద్రబాబుకు 28 సార్లు అధికారులు లేఖలు రాశారు
- ఆ లేఖలను టీడీపీ ఆఫీసుకు పంపిస్తా
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రంలో రైతులకు దుస్థితి ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనవరి నుంచి విత్తనాల సేకరణకు నిధులు అడిగినా ఇవ్వలేదని, చంద్రబాబుకు 28 సార్లు అధికారులు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేశ్ లు సమాధానం చెప్పాలని, వ్యవసాయ శాఖాధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీసుకు పంపిస్తానని అన్నారు.
చంద్రబాబు రైతులను ముంచేసినా, విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా దారి మళ్లించారని దుయ్యబట్టారు. చేయాల్సిన నష్టమంతా చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఉబలాటపడుతున్నారని, బాబు నిర్వాకాన్ని ఆధారాలతో సహా ఎండగడతామని అన్నారు.