: కమల్ ను వెంటాడుతోన్న 'విశ్వరూపం' వివాదం
భారత్ గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రం విశ్వరూపం. ఆ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో నిలిచింది. అవాంతరాలను అధిగమించి ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వరూపం కమల్ ను అన్నివిధాలా ఆదుకుంది. మంచి కలెక్షన్స్ రాబట్టడంతోపాటు, నటనకు గాను కమల్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ చిత్రం ద్వారా ఈ విలక్షణ నటుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం కార్యదర్శి పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేశారు.
ఇంతకీ ఆ గొడవేంటంటే.. కమల్ వినూత్న వ్యాపార పోకడలను ప్రదర్శిస్తూ, తొలుత డీటీహెచ్ లో విశ్వరూపం చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించారు. కానీ, చిత్రాన్ని డీటీహెచ్ ఫార్మాట్లో విడుదల చేయడాన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. ఆ తర్వాత, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ముస్లిం సంఘాలు ఆందోళన చేయగా, కమల్ కోర్టుకెళ్ళి సమస్యను పరిష్కరించుకున్నారు. అనంతరం తమిళనాడు వ్యాప్తంగా సినిమా విడుదల అయింది. అయితే, ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమని డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం తీర్మానం చేసినట్టు కమల్ భారత సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేశారని పన్నీర్ సెల్వం తాజాగా వెల్లడించారు.
తాము అలాంటి తీర్మానాలు చేయకపోయినా, చేసినట్టు కమల్ ఆరోపించడంపై తాము గత నెల 17 పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని సెల్వం వాపోయారు. అందుకే, తక్షణమే కమల్ పైనా, ఆయన చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పైనా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ లో కోరామని సెల్వం తెలిపారు.