Jagan: నేడు, రేపు జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ 'ప్రత్యేక' క్లాసులు!
- ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్లతో సీఎం సదస్సులు
- మేనిఫెస్టో అమలుపై కార్యాచరణ
- పాలనలో తనదైన ముద్రకోసం జగన్ తాపత్రయం
ఏపీ సీఎం జగన్ పాలనలో తనదైన ముద్రవేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాలనలో పారదర్శకత కోసం తపించిపోతున్న జగన్ ముఖ్యంగా తాను మాటిచ్చిన నవరత్నాల అమలుపై గట్టి పట్టుదలతో ఉన్నారు. నవరత్నాల అమలులో క్షేత్రస్థాయిలో ఎక్కడా పొరబాటు జరగకుండా చూసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు తన ఆలోచనలు వివరించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే నేడు, రేపు ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్లతో జగన్ ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు.
మొదటిరోజు సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నవరత్నాల అమలు ప్రధాన అజెండాగా సదస్సు జరగనుంది. కలెక్టర్లను, ఉన్నతాధికారులను ఉద్దేశించి జగన్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అవినీతి రహిత పాలన, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వలంటీర్లు, 108, 104 సర్వీసుల పనితీరు, రేషన్ సరుకుల డోర్ డెలివరీ, రైతుల సమస్యలు, కరవు, విద్యారంగం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం తర్వాత వైఎస్సార్ పెన్షన్లు, అందరికీ గృహాల అంశాలపై చర్చిస్తారు.