Nadigar: నడిగర్ సంఘం ఎన్నికలు.. ఎంతో ఆనందంగా ఓటు వేశాను: సినీ నటి రాధ
- ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలి
- సినిమాకు ప్రాంతం, మతం, కులంతో సంబంధం లేదు
- సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
చెన్నైలో ఈరోజు ఉదయం ప్రారంభమైన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసిన సినీ నటి రాధను మీడియా పలకరించగా ఆమె మాట్లాడుతూ, ఎంతో ఆనందంగా ఓటు వేశానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ‘సినిమా‘కు ప్రాంతం, మతం, కులంతో సంబంధం లేదని, సినీ పరిశ్రమకు చెందిన వారందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటామని అన్నారు. కాగా, నడిగర్ ఎన్నికల సంఘం పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.ఈ ఎన్నికల్లో ‘నడిగర్’ అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నాజర్, జనరల్ సెక్రటరీగా నటుడు విశాల్, ట్రెజరర్ గా నటుడు కార్తీ పోటీలో ఉన్నారు. స్వామి శంకర్ టీమ్ నుంచి సీనియర్ నటుడు భాగ్యరాజ్, విశాల్ లు పోటీ చేస్తున్నారు.