Chandrababu: బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు: విజయసాయిరెడ్డి
- కేసుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు
- జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు
- ఎంపీలను బీజేపీలోకి పంపి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ బీజేపీతో సయోధ్య కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి... రూట్ క్లియర్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో చేయి కలిపి, కేసుల నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. కానీ, జగన్ మాత్రం ప్రజలంతా నావారే, ఎవరి పట్ల వివక్ష ఉండదని చెప్పారని... చంద్రబాబుకు, జగన్ కు మధ్య ఉన్న తేడా ఇదేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.