Jagan: జగన్ పోలవరం సందర్శన... సీఎం ప్రశ్నలకు ఇబ్బందిపడిన అధికారులు!
- కాఫర్ డ్యామ్ పనులపై జగన్ ప్రశ్నలు
- పోలవరం ప్రాజక్టును ఏరియల్ సర్వే చేసిన ఏపీ సీఎం
- వ్యూ పాయింట్ నుంచి పనుల పరిశీలన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పోలవరం ప్రాజక్టును సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నేత ఇంట్లో పెళ్లివేడుకకు హాజరైన జగన్ అట్నుంచి పోలవరం వెళ్లారు. అయితే, ప్రాజక్టు పనులు జరుగుతున్న తీరు పట్ల ముందే ఓ అవగాహనతో ఉన్న జగన్ పోలవరం డ్యామ్ అధికారులను సూటిగా ప్రశ్నించారు.
కాఫర్ డ్యామ్ కారణంగా నీరు స్పిల్ వే పైకి చేరుకుంటే ఏం చేస్తారు? నిర్మాణంలో ఉన్న కట్టడాలకు వరద నీరు ఆటంకం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వరద వచ్చేనాటికి కాఫర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటి? అంటూ వరుసబెట్టి ప్రశ్నలు సంధించారు. దాంతో, అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. దాంతో జగన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతకుముందు జగన్ పోలవరం ప్రాజక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజక్టులో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.