chandrababu: చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తాం: ఆర్కే
- కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలపై పోరాటం కొనసాగుతుంది
- అక్రమంగా కట్టిన నివాసంలోనే చంద్రబాబు ఉంటున్నారు
- రాజధాని పనులు ఎందుకు ఆగిపోయాయో నాకు తెలియదు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమంగా నిర్మించిన నివాసంలో ఉంటున్నారంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలపై కోర్టులో పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. చంద్రబాబు కూడా అలాంటి అక్రమ నిర్మాణంలోనే నివాసం ఉంటున్నారని... ఆ నివాసం నుంచి ఆయనను ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారు.
రాజధాని గురించి మాట్లాడే చంద్రబాబు... అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు కట్టుకున్నారని... చంద్రబాబు ఎక్కడ కట్టుకున్నారని ప్రశ్నించారు. రాజధాని పనులు ఎందుకు ఆగిపోయాయో తనకు తెలియదని... పనులను ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్లు చెప్పాలని అన్నారు. కాంట్రాక్టర్లకు ఏవైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ ఛైర్మన్ పదవిని తనకు ఇస్తున్నారనే విషయం తెలియదని చెప్పారు.