Tractor: మరో బిడ్డను కాపాడి, తన బిడ్డను పోగొట్టుకున్న తల్లి!
- నిలిపివుంచిన ట్రాక్టర్ ను స్టార్ట్ చేసిన నాలుగేళ్ల చిన్నారి
- ఏడుపు విని పరుగున వచ్చి కాపాడిన మహిళ
- అప్పటికే ట్రాక్టర్ కింద పడి కన్నబిడ్డ మరణం
నిలిచిన ట్రాక్టర్ పైకి ఎక్కిన పక్కింటివారి అబ్బాయి, దాని తాళం తిప్పి స్టార్ట్ చేయడంతో, అదుపు తప్పి వెళుతున్న ట్రాక్టర్ నుంచి ఆ బిడ్డను కాపాడిన ఓ తల్లి, తన కన్నబిడ్డను దూరం చేసుకున్న దురదృష్టకర ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అమరావతి ప్లాట్స్ సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆటలాడుతున్నారు.
నాలుగేళ్ల ఓ బాలుడు ఆపి ఉంచిన ట్రాక్టర్ ఎక్కి తాళం తిప్పడంతో, అది ముందుకు దూకింది. ఇదే సమయంలో తన ఏడాదిన్నర బాబు పవన్ ఎక్కడ ఆడుకుంటున్నాడోనని బయటకు వచ్చిన సులోచన అనే యువతికి ట్రాక్టర్ పై ఉన్న పిల్లాడు భయంతో అరుస్తూ కనిపించగా, ఒక్క ఉదుటన అక్కడికి వెళ్లి, దానిపై ఉన్న చిన్నారిని బయటకు లాగింది. హమ్మయ్య అనుకుంటూ, వెనక్కు తిరిగి చూసిన ఆమెకు, గుండెలు బద్దలయ్యే దృశ్యం కనిపించింది. తన బిడ్డ ట్రాక్టర్ కింద నలిగి విగతజీవిగా ఆమెకు కనిపించాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా విలపించింది.
భర్తతో కలహాల నేపథ్యంలో, క్యాటరింగ్ పనులు చేసుకునే తన స్నేహితురాలి ఇంటికి వచ్చి ఆమె, అక్కడే ఉంటూ, ఆమెతో పాటు పనులకు వెళుతుండేది. కాగా, చిన్నారి మరణం గురించి తెలుసుకున్న పోలీసులు, ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.