Vijayawada: శారదా పీఠ ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ దీక్ష స్వీకరణ.. స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం

  • శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం
  • సన్యాసాశ్రమం స్వీకరించిన కిరణ్ కుమార్ శర్మ
  • అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం

విజయవాడలో నిర్వహిస్తున్న శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాసం స్వీకరించారు.

సన్యాసాశ్రమం స్వీకరణ అనంతరం కిరణ్ కుమార్ శర్మ (బాలస్వామి) పేరును స్వాత్మానందేంద్ర సరస్వతిగా స్వరూపానందేంద్ర సరస్వతి నామకరణం చేశారు. అనంతరం  స్వాత్మానందేంద్ర సరస్వతికి రుద్రాక్షమాల వేసి, హారతి ఇచ్చి పట్టాభిషేకం చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతి పాదాలకు స్వరూపానందేంద్ర సరస్వతి నమస్కరించారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పాదపూజ చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కిరీటధారణ చేశారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన దేవాలయాల నుంచి తీసుకువచ్చిన ప్రసాదాలను ఆయా ఆలయాలకు చెందిన పండితులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్ కుమార్ శర్మ సన్యాశ్రమ దీక్షా స్వీకరణ జరిగింది.

కాగా, సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడు రోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించారు.

More Telugu News