JC: నేనిప్పటికీ టీడీపీలోనే ఉన్నా: జేసీ దివాకర్ రెడ్డి
- నేను ఎటూ మొగ్గుచూపడంలేదు
- అమిత్ షాను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదు
- కొంతకాలం మౌనంగా ఉందామని చంద్రబాబుకు కూడా చెప్పా
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ ఆసక్తికరంగా మాట్లాడారు. తానిప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఏ పార్టీవైపు మొగ్గు చూపడంలేదన్నారు. మా పార్టీలోకి వస్తారా అని తనను కొందరు అడిగిన మాట వాస్తవమేనని, అయితే తాను అమిత్ షాను కలిసినట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని జేసీ స్పష్టం చేశారు. తాను ఎన్నికల ముందు చాలాసార్లు నరేంద్ర మోదీని కలిశానే తప్ప అమిత్ షాతో ఎన్నడూ భేటీ కాలేదని చెప్పారు.
తాను టీడీపీలోనే ఉన్నానని, అయితే కొంతకాలంగా పాటు మౌనంగా ఉందామని చంద్రబాబుతో కూడా చెప్పానని వివరించారు. ఎదుటి పక్షం ఏచేస్తుందో చూసి ఆ తర్వాతే మాట్లాడదామని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక ఎన్నికల ఫలితాల గురించి చెబుతూ, చంద్రబాబుపై కసి కంటే కూడా జగన్ కు ఓ అవకాశం ఇవ్వాలన్న అంశమే ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపిందని జేసీ అన్నారు.