Jagan: శాసనసభలో భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టిన మంత్రి పుష్పశ్రీవాణి
- గిరిజన మహిళనైన నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు
- అట్టడుగు వర్గాలకు గొంతుక వినిపించే అవకాశం కల్పించారు
- జగన్ ఆధ్వర్యంలో ఈ సభ గొప్పగా నడుస్తుంది
ఏపీ మంత్రి పుష్పశ్రీవాణి ఇవాళ శాసనసభలో భావోద్వేగాలు అదుపుచేసుకోలేక కంటతడిపెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె స్పీకర్ కు ధన్యవాద తీర్మానం వేళ ప్రసంగించారు. ఓ గిరిజన మహిళనైన తనను రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్ కే చెల్లుతుందని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు కూడా తమ గొంతుక వినిపించే అవకాశం కల్పించడం ద్వారా జగన్ ఇతర రాష్ట్రాలకు సైతం స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, దేశానికి గొప్ప సంకేతం పంపారని కొనియాడారు.
గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు గొప్ప అవకాశం ఇచ్చారని, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి భావోద్వేగాలకు లోనయ్యారు. ఉబికివచ్చిన కన్నీటిని ఆపుకుంటూ తన ప్రసంగం కొనసాగించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఈ శాసనసభ విలువలు, విశ్వసనీయతలతో నడుస్తుందని ధీమాగా చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం ఇది రెండోసారని, గతంలో మొదటి పర్యాయం అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు రాజ్యాంగ విలువలు మంటగలిసిపోవడాన్ని చూశామని అన్నారు. ఆ సమయంలో జగన్ తన వయసుకు మించిన పరిణతి చూపించి ప్రతిపక్షనేతగా ఎంతో హుందాగా వ్యవహరించారంటూ పుష్పశ్రీవాణి కితాబిచ్చారు.