Jagan: చంద్రబాబు గారూ మళ్లీ చెబుతున్నా... జగన్ అలాంటి వ్యక్తి కాదు: చెవిరెడ్డి
- జగన్ అందరివాడు
- మీకు ఓటేసినవాళ్లకు కూడా అర్హత ఉంటే అన్నీ ఇస్తాడు
- జగన్ కు సహకరించండి
జగన్ సీఎం అయ్యాక ఏపీ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాగా, అధికార వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభ ప్రాంగణంలో భావోద్వేగాలతో ప్రసంగించారు. తొలిసారిగా జగన్ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతున్న వేళ, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు కూడా సహకరించాలని చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జగన్ చేస్తున్న మంచిపనులను చంద్రబాబునాయుడు సమర్థించాలని కోరారు.
"చంద్రబాబునాయుడు గారూ, మీకు మళ్లీ చెబుతున్నా. జగన్ ఏ వర్గానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో చెందినవాడు కాదు. అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు, అందరికీ మేలు చేసే వ్యక్తి. చివరికి టీడీపీకి ఓటేసిన వ్యక్తికైనా అర్హత ఉంటే ఇల్లయినా, పొలమైనా, రేషన్ కార్డు అయినా, రుణమైనా ఇవ్వాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి జగన్. తన పాలన ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్న జగన్ కు చంద్రబాబు అన్ని విధాలా తోడ్పాటు అందించాలి" అన్నారు చెవిరెడ్డి.