Andhra Pradesh: తెలంగాణకు కేటాయించిన భవనాల్లోని సామగ్రిని అమరావతికి తరలిస్తున్న అధికారులు
- అమరావతి కేంద్రంగా ఏపీ పాలన
- నిరుపయోగంగా ఏపీ భవనాలు
- తెలంగాణకు కేటాయించిన గవర్నర్
రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ భవనాలను ఏపీ పరిపాలన కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి కేంద్రంగా ఏపీ పరిపాలన సాగుతుండడంతో హైదరాబాద్ లోని ఆ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వాటిలోని అత్యధిక భవనాలను గవర్నర్ నరసింహన్ చొరవతో తెలంగాణకు కేటాయించారు. ఏపీ హోంశాఖకు, ఇతర ముఖ్య శాఖలకు రెండు భవనాలు ఇచ్చి మిగతావాటిని తెలంగాణకు కేటాయించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణకు కేటాయించిన భవనాల నుంచి సామగ్రిని అమరావతి తరలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో ఉన్న విలువైన స్టేషనరీ, ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో అమరావతి పంపిస్తున్నారు. ఏపీ జీఏడీ అధికారుల పర్యవేక్షణలో ఈ తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.