Chandrababu: చంద్రబాబు ఇక ఏం చేస్తారన్నది అనవసర విషయం!: నటుడు పృథ్వీరాజ్
- చంద్రబాబు గురించి మాట్లాడ్డం సబబు కాదు
- 90 లక్షల మంది ఓటేస్తారని బాబు నమ్మారు
- బైబై బాబు అంటూ వీడ్కోలు పలికారు
ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబునాయుడు ఏం చేస్తారన్నది వాళ్లే తేల్చుకోవాలని, వాళ్ల ఇంట్లో ఏం వండుకుంటున్నారు? ఏ కాఫీ పెడుతున్నారు? అనేది ఇక అనవసర విషయం అని సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. పసుపు-కుంకుమ ఆదుకుంటుందని, 90 లక్షల మంది మహిళలు ఓట్లేస్తారని చంద్రబాబు నమ్మారని, కానీ 'బైబై బాబు' అంటూ ప్రజలు వీడ్కోలు పలికారని ఆయన విశ్లేషించారు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువైన తరుణంలో కూడా ఇంకా చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇకమీదట టీడీపీలో ఏం జరుగుతుంది? వాళ్ల కార్యాచరణ ఏమిటి? వంటివన్నీ కూడా వాళ్లకు సంబంధించిన విషయాలే తప్ప తాము మాట్లాడ్డానికి ఏమీలేదని పృథ్వీ స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.