Jagan: వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏం బాగాలేదు: జగన్ అసంతృప్తి
- సమూల ప్రక్షాళన తప్పదు
- అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం
- పేదవారికి నాణ్యమైన వైద్యసేవలు అందాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్నటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలు చేపడుతూ ఆయా శాఖల పనితీరును అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యశాఖ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని, శాఖ పనితీరు మెరుగుపరచాలంటే సమూల ప్రక్షాళన తప్పదని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానంగా, పేదవారికి నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ సమూల ప్రక్షాళన కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ వెల్లడించారు.