Telangana: ఏలిన నాటి శని పీడ వదిలిస్తానని చెప్పి...!

  • మహిళను మోసం చేసిన అపరిచితుడు
  • బంగారు నగలతో ఉడాయించిన వైనం
  • ఘొల్లుమన్న బాధితురాలు

చాలామంది తమ కష్టాలకు శని కారణమని నమ్ముతుంటారు. అలాంటి వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు తెగిస్తుంటారు. మహబూబ్ నగర్ శివారు ప్రాంతంలోని మెట్టుగడ్డలో ఇలాంటి ఘటనే జరిగింది. నవనీత అనే మహిళ తన కుటుంబంతో కలిసి మెట్టుగడ్డలో నివసిస్తోంది. అయితే, శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి ఓ వ్యక్తి వచ్చి, మీకు ఏలిన నాటి శని పట్టుకుంది, వదిలిస్తాను అంటూ నమ్మబలికాడు.

అప్పటికే కొన్ని కష్టాల్లో ఉన్న నవనీత అది నిజమే అని భావించింది. ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఓ టిఫిన్ బాక్స్, ఇంట్లో ఉన్న బంగారం, రాగి చెంబులో నీరు తీసుకువచ్చింది. కొన్ని అగర్ బత్తీలు, బియ్యం కూడా తీసుకురమ్మనడంతో అతను చెప్పినట్టే చేసింది. ఆపై కొన్ని పూజలు చేసిన ఆ వ్యక్తి బంగారాన్ని బియ్యంతో కలిపి టిఫిన్ బాక్స్ లో పెట్టి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోమని చెప్పాడు.

పూజ అయిపోయింది, తాను వెళుతున్నానని చెప్పి ఆ టిఫిన్ బాక్స్ ను సాయంత్రం పూటే తెరవాలని సూచించాడు. అతను చెప్పినట్టే సాయంత్రం టిఫిన్ బాక్స్ తెరిచి చూస్తే బియ్యం తప్ప ఏమీ కనిపించలేదు. దాంతో తాము మోసపోయిన విషయాన్ని నవనీత, కుటుంబ సభ్యులు గ్రహించి లబోదిబోమన్నారు. ఆ అపరిచుతుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News