Telangana: తల్లిలేని అమ్మాయికి ప్రేమ వివాహం జరిపించిన ఎమ్మెల్యే దంపతులు
- దుబ్బాక శాసనసభ్యుడి ఔదార్యం
- కిరాతక తండ్రి బారినుంచి బాలికను కాపాడి ప్రయోజకురాల్ని చేసిన వైనం
- కోరుకున్న వ్యక్తితో పెళ్లి
తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులు ఓ తల్లిలేని అమ్మాయికి సొంత తల్లిదండ్రుల కంటే మిన్నగా పెళ్లి జరిపించి వార్తల్లోకెక్కారు. అది కూడా ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తితో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచారు. అసలు విషయం ఏమిటంటే, సిద్ధిపేట జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఉండే సావిత్రికి, కామారెడ్డి మండలానికి చెందిన సాయాగౌడ్ కు పెళ్లయింది. వీరికి రేఖ అనే పాప పుట్టింది.
అయితే ఎనిమిదేళ్ల కిందట సాయాగౌడ్ తన భార్యను విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా హత్యచేసినట్టు ఊరంతా గుప్పుమంది. అంతేకాకుండా, 17 ఏళ్ల వయసున్న తన కుమార్తెను మరొకరికి విక్రయించాలని ప్రయత్నించాడు. దాంతో రేఖ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించగా, ఆయన తన భార్య సుజాత సమ్మతి తీసుకుని ఆ బాలిక సంరక్షణను స్వీకరించారు.
రేఖను తండ్రి సాయాగౌడ్ చెర నుంచి విడిపించిన సోలిపేట దంపతులు ఆమెను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చంతా తామే భరించారు. వారి ఔదార్యం, రేఖ కష్టం ఫలించి ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అదే సంస్థలో పనిచేస్తున్న సురేశ్ అనే యువకుడిని తాను ఇష్టపడ్డానని రేఖ ఎమ్మెల్యే దంపతులకు చెప్పగా, వాళ్లు ఎంతో పెద్దమనసుతో అర్థం చేసుకుని, ఆమె అభీష్టం మేరకు వివాహం జరిపించారు. కన్యాదానం చేసి రేఖను ఓ ఇంటిదాన్ని చేసి తృప్తి చెందారు.