Jagan: ప్రజల ఉత్సాహాన్ని చూసి ఆవేశంతో ప్రసంగించిన జగన్
- పాలన మొత్తం పారదర్శకంగా ఉంటుంది
- ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తే పరువునష్టం దావా వేస్తాం
- సంవత్సరం సమయం ఇవ్వండి, అవినీతిని నిర్మూలిస్తా
నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కొత్త శకం ఆరంభమైంది. తొమ్మిదేళ్ల క్రితం పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురుచూసిన ఘడియలు రానేరావడంతో జగన్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్ ప్రసంగం యావత్తు మూర్తీభవించిన ఆవేశంతో సాగింది.
తమ పాలనలో టెండర్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఒకవేళ ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తే తమ ప్రభుత్వం పరువునష్టం దావా వేస్తుందని చెప్పారు. తనకు ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం ఇవ్వాలని, రాష్ట్రంలో కింది స్థానం నుంచి పైస్థానం వరకు అవినీతి అనేది లేకుండా ప్రక్షాళన చేస్తానని చెబుతూ జగన్ ఒక్కసారిగా గొంతు పెంచారు. దాంతో ఆయన గొంతు బొంగరుపోయింది. మధ్యలో కొన్ని పదాలను పలికినా అవి ప్రజలకు సరిగా వినిపించలేదు. అయినా సరే జగన్ అలాగే కొనసాగించారు. మధ్యలో భద్రతా సిబ్బంది ఇచ్చిన మంచినీరు తాగి గొంతు సవరించుకుని ఎక్కడా తగ్గించకుండా అదే తీవ్రత చూపించారు.